సంవేద ఒక అమ్మాయి కధ 1

By | March 10, 2021
సంవేద ఒక అమ్మాయి కధ 1 ఇది ఒక అమ్మాయి కధ. ఒక అమ్మాయి విలువల మధ్య వ్యక్తిగత అభిప్రాయాల మధ్య అమ్మాయి మదిలో జరిగే సంఘర్షణ గురించి ఈ కధలో ప్రస్తావించడం జరిగింది. చదవడం ప్రారంభించండి.ఈ కధ, కధలోని పాత్రలు అన్ని కేవలం కల్పిత0 బంజారా హిల్స్.. అది రెండంతస్తుల మేడ . ఆ ఇంట్లో ఉదయం 8 గంటల సమయంలో సూర్యుడి నుండి వచ్చే కిరణాల వెచ్చని తాకిడికి మంచం మీద పడుకున్న వేద కి మెలుకువ వచ్చింది. మేలుకు వచ్చింది అన్న మాటే గాని కళ్ళు తెరవడానికి ఇంకా బద్దకంగా అనిపించి మంచం మీదే ఇంకా అటు ఇటు దొర్లుతూ ఉంది. సరిగ్గా అప్పుడే "ఏ దివిలో విరిసిన పారిజాతమో ..." అంటూ సెల్ మోగడంతో సెల్ ని తీస్కొని లిఫ్ట్ చేసింది."హలో.." అంటూ "హలో ఏంటే ఇంకా నిద్ర లేవలేదా ఆల్రెడీ 8 ఐంది యివాళ 9 కి మీటింగ్ ఉంది మరచిపోయావా?"అంది కస్తూరి. ఆ మాట తో ఒక్కసారిగా బద్ధకం వదిలిపోయింది. "ఓహ్ అవును కదా సారీ నే మర్చిపోయాను.. ఒక 30 మినిట్స్ లో రెడీ అయిపోతాను నువ్వు ఈలోపు ఇంటికి వచ్చేయి వెళ్ళిపోదాం." అంది"సరే.. తొందరగా రెడీ అవ్వు నేను ఒక 30 మినిట్స్ లో వస్తాను. బై" అంది"ఓకే బై" చెప్పినట్టుగానే ఒక అరగంట లో రెడీ ఐంది వేద. వాళ్ళ ఇంటి నుండి ఆఫీసు కి వెళ్ళాలంటే కనీసం అర గంట పడ్తుంది . అందుకే ఇద్దరు అరగంట కన్నా ముందే బయలు దేరారు ఆఫీసు కి. వేద, కస్తూరి మంచి స్నేహితులు. వేద ఆఫీసు లో చేరి 1 సంవత్సరం అవుతోంది, అప్పటి నుండి వేద కస్తూరి పరిచయం పెరిగి స్నేహం గా మారింది. అప్పటినుండి వాళ్ళిద్దరూ ఆఫీసు కి వీలైనప్పుడల్లా కలిసే వెళుతుంటారు. ఎప్పుడైనా పని ఎక్కువ ఉండి గాని లేకపోతే ఇద్దర్లో ఒకరికి పని తొందరగా అయిపోయిన ఎవరికీ వారు విడిగా వాళ్ళ బండి మీద వెళ్ళిపోతారు. వాళిద్దరూ ఆఫీసు కి చేరుకునేసరికి తొమ్మిది అయింది. ఆఫీసు కి వెళ్ళంగానే వేద తన మీటింగ్ లో బిజీ గా ఉండిపోయింది. ఆ మీటింగ్ పూర్తయ్యేటప్పటికి రెండు గంటలు పట్టింది. మీటింగ్ అయిపోగానే వేద కస్తూరి తో కలిసి కాంటీన్ కి వచ్చింది ఏమైనా టిఫిన్ తినడానికి. టిఫిన్ తీస్కుంటుంటే వేద అడిగింది కస్తూరి ని "ఎంతవరకు వచ్చాయే నీ పెళ్లి పనులు. నిశ్చితార్దానికి ముహూర్తం కుదిరిందా?" "ఇంకా లేదు ఆ విషయాలు మాట్లాడుకోవడానికే ఇవాళ అమ్మ వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంకటికి వెళ్తున్నారు. అక్కడ నిశ్చితార్దానికి మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయం చేసుకుంటారు. అలాగే పెళ్ళి కి కూడ ఇవాళే ముహూర్తం చూసుకుంటారనుకుంట" "అయితే మా కస్తూరి తొందరలోనే పెళ్ళికూతురైపోతుందనమాట. కంగ్రాట్స్" "థాంక్సె పద ఇప్పటికే లేట్ అయింది చాలా పని పెండింగ్ లో ఉండిపోయింది" నగరం లో ఆశ హాస్పిటల్ కి చాలా మంచి పేరు ఉంది. ఆ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం చాల పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. గుండెకి సంబంధించిన జబ్బులని నయం చేయడం లో మంచి ప్రాముఖ్యత సంపాదించుకుంది. అక్కడే కైళాష్ పని చేసేది. కైళాష్ కి 29 ఏళ్ళు ఉంటాయి చూడడానికి బాగుంటాడు. ఆ హాస్పిటల్ లో సంవత్సరం నుంచి పని చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే హార్ట్ స్పెషలిస్ట్ గా మంచి పేరు వస్తోంది. ఆ రోజు ముఖ్యమైన రోగులు లేనందువల్ల కైళాష్ పని పూర్తిచేసుకొని సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లేసరికి చందన మేడ మెట్ల మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటోంది. చందన కైళాష్ కి చెల్లెలు. కైళాష్ కి ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు. అన్నయ్య నగరం లో వకీలుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చెల్లెలు ఇంకా ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతొంది. అన్నయ్య కి పెళ్ళి అయ్యి నాలుగు సంవత్సరాలవుతోంది. కైళాష్ వాళ్ళ వొదిన పేరు హంస. చాలా నెమ్మదస్తురాలు. ఆ ఇంటి కి ఆ ఇంట్లో మనుషులకు బాగా అలవాటు ఐపోయింది. వాళిద్దరికి ఒక బాబు. కైలాష్ వాళ్ళ అమ్మ పేరు రాధ. రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ ఇంట్లో కైళాష్ వాళ్ళ అమ్మగారు, అన్న వొదిన, చెల్లెలు ఉంటారు. మేడ మెట్ల మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటున్న చందన కార్ హార్న్ వినగానే అన్నయ్య దగ్గరకి వచ్చింది. " హమ్మయ్య వచ్చేసావా ఇందాకటినుండి నీకోసం చూస్తూ ఇక్కడే కుర్చున్నా ఏవి నేను అడిగిన టెక్స్ట్ బుక్స్? తెచ్చావా.." "నన్ను కనీసం లోపలికి కూడా రానీయవా ఇవిగో నువ్వు అడిగిన పుస్తకాలు. సరిగ్గా చూసుకో ఇవేనా, మళ్ళీ ఇవి కాదు ఇంకోటి అంటే ఇంక నాకు తిరిగే ఓపిక కూడా లేదు. ఇప్పటికే వీటికోసం మూడు సార్లు తిరిగా" "హా ఇదే అన్నయ్య థాంక్స్" "హమ్మయ్య రక్షించావ్ తీసుకో" అంటూ ఇంట్లోకి వెళ్ళాడు. "అమ్మా అన్నయ్య వచ్చాడా" "ఇంకా లేదురా ఇంకో గంట అయినా అవుతుందేమో" "సరే ఈలోగా నేను స్నానం చేసి వస్తాను" "సరే" వేద ఆఫిస్ లో బయలుదేరేటప్పటికి ఏడు దాటిపోయింది. కస్తూరి వేదని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. వేద ఉండేది కైళ్ళాష్ వాళ్ళ ఇంట్లోనే. కింద కైళ్ళాష్ వాళ్ళు ఉంటే వేద వాళ్ళ ఇంటి మేడ మీద రెండో అంతస్తు లో ఉంటుంది. కస్తూరి కి బై చెప్పి వెనక్కి తిరిగి మేడ మెట్ల దగ్గరికి నడుస్తోంది. ఆ రోజు పని ఎక్కువగా ఉండడం వల్ల చాలా చిరాగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి స్నానం చేసి తినేసి పడుకుందామా అనిపిస్తొంది వేదకి. మేడ మెట్లు ఎక్కుతున్న వేద కి హఠాత్తుగా "హాయి వొదినా" అన్న పిలుపు వినపడింది. అసలే అలసటతో చిరాగ్గా ఉంది దాంతో పాటు తనకు ఎంత మాత్రం ఇష్టం లేని ఆ పిలిపు వినిపించడంతో తలెత్తి కోపంగా చూసింది. ఎదురుగా చందన భుజం మీద ఆరిన బట్టలు తీసుకొని కిందకి వస్తొంది. వేద మొహం చూసిన చందనకి చాలా భయం వేసింది. వేద మొహం కోపం తో ఎర్రగా కందిపోయి ఉంది. "చందన నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను అలా పిలవొద్దు అని. ఒకసారి చెప్తే నీకు ఎందుకు అర్ధం కాదో నాకు తెలియట్లేదు ఇంకో సారి నన్ను అలా పిలిచావంటే నేను ఊరుకోను. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది ఇంకోసారి అలా పిలిచి నా సహనాన్ని పరీక్ష చేయకు." అని చాలా గట్టిగా చెప్పి విసురుగా మేడ మీదకి వెళ్ళిపోయింది. వేద మాటలకి చందన చాలా బాధ పడింది. తనకి తెలుసు వేదకి ఆ పిలుపు ఇష్టం ఉండదని కాని తనని చూడగానే అనుకోకుండా అలా పిలిచేస్తుంది. ఇది ఒకసారి కాదు ఈ రెండు నెలల్లో ఇది ఇప్పటికి చాలా సార్లే జరిగింది. కాని ఎంత కాదనుకున్నా వొదిన ని అలా కాకుండా ఇంక ఎలా పలకరించాలో చందనకి బోధ పడలేదు.అలా అని అంటిముట్టుకోకుండా కూడా ఉండలేదు. ఈ సమస్య ఏదో తొందరగా పరిష్కారమయిపోయిపోతే బావుండు అనుకుంటూ బట్టలు తీసుకొని కిందకి వచ్చింది. చందన బట్టలు తెచ్చి హాల్ లో సోఫా లో వేసి ఒకొకటి మడత పెడుతోంది. రాధా, కైళాష్, హంస అంత హాల్ లో టీవీ చూస్తూ శైలేష్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే బాబు కి అన్నం పెట్టేసి పడుకోపెట్టింది హంస. బట్టలు మడతపెడుతున్న చందన ఎందుకో డల్ గా కనిపించేసరికి రాధ అడిగింది. "ఏమయింది చందన మేడ మీదకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా ఇంతలో ఏం జరిగింది?" "ఏం లేదు అమ్మ" "నువ్వు ఏం లేదు అనడం తోనే అర్ధం అవుతోంది ఏదో ఉంది అని ఏం జరిగింది" "ఏం లేదు ఆరిన బట్టలు కిందకి తీసుకొస్తుంటే వొదిన మేడ మెట్లు ఎక్కుతూ కనిపించింది. దాంతో హాయ్ వొదిన అని పలకరించా అంతే "వొదిన" అన్న మాటికి తనకి చాలా కోపం వచ్చింది. ఇంకో సారి వొదిన అని పిలవొద్దని చాలా గట్టిగా చెప్పింది అందుకే కొంచం బాధగా ఉందమ్మా" ఆ మాట వినగానే రాధా, కైళాష్ మొహం లో కొంచం నిరాశ కనిపించింది . కాని ఆ నిరాశ ని కనపడనీయకుండా అంది రాధ "చూడమ్మా ముందుగా మీ వదిన కి మన మీద ఉన్న కోపం తగ్గాలి. మనం తనని ఈ ఇంటి కోడలిగా భావిస్తున్నాం, కాని జరిగింది మర్చిపోయి తను మనందరితో కలిసిపోయి మనల్ని తన వాళ్ళు గా భావించుకోవాలి, కాని జరిగింది మర్చిపోవడం మనం చెప్పుకుంటునంత సులభం ఏం కాదు దానికి ఆ అమ్మాయికి చాలా సమయం పడుతుంది. దాని తర్వాత తను ఈ ఇంటి కోడలిననే బంధాన్ని ఒప్పుకొవాలి. ఇదంతా జరిగేంతవరకు మనం కూడా తను పరిస్థితిని అర్ధం చేసుకుని తనకి కావాల్సినంత సమయం ఇవ్వాలి. అప్పటి దాక మనం ఏమీ తొందరపడలేం, ఏమీ నచ్చచెప్పలేం. అంతే కాదు ఇప్పుడు మనం ఏం చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదు. కాబట్టి మనం ఓపిక పట్టాలి. ఇంక ఆ విషయం ఇక్కడితో మర్చిపో " అంది రాధ. ఇంతలో శైలేష్ వచ్చాడు. వస్తూనే అందరూ హాల్ లో డల్ గా ఉండడం గమనించి అడిగాడు "హాయ్ ఏంటి ఏమైంది ఇవాళ అందరూ డల్ గా కనిపిస్తున్నారు" "ఏం లేదు లేరా ఏవో మామూలు విషయాలే గాని, ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది" "అవునమ్మా కొంచం పని ఉంది" "సరేలే వెళ్లి స్నానం చేసి రా భోజనం చేద్దాం" "సరే" అని లోపలికి వెళ్ళిపోయాడు. వేద తలుపుకి తాళం తీసి లోపలికి వెళ్ళి బాగ్ మంచం మీద పడేసింది. చందన తనని "వదినా" అని పిలిచినప్పటి నుండి ఆమెకి మనసేం బాలెదు.అసలే ఆఫిస్ నుండి రావడమే చాలా అలసటగా వచ్చింది దానికి తోడు ఇందాక చందన పిలుపుతో చాలా అసహనానికి గురి అయింది. ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకు వస్తోంది. చాల చిరాగ్గా ఉంది ఆమెకు. "ఛ, ఆ అమ్మాయికి అసలు బుద్ధి లేదు ఎన్ని సార్లు చెప్పాను అలా పిలవొద్దు అని అసలు వినిపించుకోదు. మూడ్ అంత పాడైపోయింది.ఇంకా ఇక్కడ పది నెలలు ఉండాలి. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగం లా గడుస్తోంది. ఈ పది నెలలు ఎప్పుడు పూర్తవుతాయో ఏంటో .ఇప్పటికే రెండు నెలలు గడవడమే చాల కష్టం అయింది. అసలు వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అనవసరం గా ఒప్పుకున్నా." అని బాధ పడింది ఇంతలో ఫోన్ మోగింది. ఫోన్ చేసింది ఎవరో కూడా చూడకుండా ఎత్తి "హలో" అంది. ఆమెలో ఉన్న అసహనం, చిరాకు అంత ఆ ఒక్క హలో అనే పదం లోనే అర్ధం అయిపోతుంది . ఆ పిలుపు వినగానే అడిగింది కస్తూరి "ఏంటే అంత చిరాగ్గ ఉన్నావు ఏమైంది?" "ఓ కస్తూరి నువ్వా. సారీనే నంబర్ చుడలేదు. ఏంటో చెప్పు" "ఏమయ్యింది మాట చాలా చిరాగ్గా వచ్చింది ఇందాక" "ఏం లేదు లే చెప్పు" "ఏం లేదని అంటావెంటే అంత చిరాకులే ఉండి" "ఏం లేదు మూడ్ కొంచం పాడయింది. ఏదైనా ముఖ్యమయిన విషయమా? లేదు అంటే - నేను తర్వాత చేస్తాను." "సరేలే ఇప్పుడు నీ మూడ్ ఏం బావునట్టు లేదు తర్వాత చేయి" అని ఫోన్ పెట్టేసింది. పెట్టేస్తూ అనుకుంది "ఏమైంది దీనికి సుడెన్ గా ఆఫిస్ నుండి వచ్చేటప్పుడు ఏదో పని ఒత్తిడే తప్ప మూడ్ బానే ఉందే. ఇంతలో ఏమయిందబ్బా? నిశ్చితార్ధం తారిఖు, పెళ్ళి తారిఖు ఖాయమయిందని చెప్దామనుకుంటే అది మూడ్ లో లేదు. సరేలే మూడ్ సెట్ అయ్యాక అదే చేస్తుంది గా అప్పుడు చెప్దాం లే" ఛ అసలు ఇందాక ఆ అమ్మాయికి ఎదురు పడకుండా ఉంటే పోయేది. స్నానం చేసి కొంచం సేపు మేడ మీద వెన్నెలలో కూర్చుందాం కొంచం అయినా మనసులో ఈ అలజడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుని స్నానం చేయడానికి బాత్రూం కి వెళ్ళింది వేద. కైళాష్ వాళ్ళందరూ భోజనాలు ముగించి బయట వెన్నెల ఉండడంతో అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఆ ఇంటి వాకిలి నుండి గేట్ వరకు చిన్న ఎత్తులో పచ్చగడ్డి పెంచి లాన్ లాగ తయారు చేసారు. సాయంత్రం, రాత్రి అలా ఆరుబయట కూర్చోవడానికి వీలుండేలాగా అక్కడ లాన్ లాగ ఏర్పరుచుకున్నారు. కార్లు పార్క్ చేసుకోవడానికి బైక్ లు పార్క్ చేసుకోవడానికి ఇంటికి వెనక వైపున స్థలాన్ని ఖాళీగా ఉంచారు. వాళ్ళకి రెండు కార్లు, ఒక బైక్ ఉన్నాయి. ఎవరి వీలును బట్టి వాళ్ళు ఆ వాహనాలని వాడుకుంటారు. వాటితో పాటు వేద బైక్ కూడా అక్కడే పార్క్ చేసి ఉంటుంది. కొంచం సేపు వాకిట్లో చల్లగాలికి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్ర పోవడానికి లేచారు. కాని కైళాష్ మాత్రం ఇంకా అక్కడే కూర్చున్నాడు. దాంతో రాధ అడిగింది "ఏంట్రా రావా?" "లేదమ్మా నేను కొంచం సేపు ఇక్కడే కూర్చుంటాను. తర్వాత వస్తాను" "సరే" కైళాష్ ఇందాక చందన వేద గురించి చెప్పిన దాన్నే ఆలోచిస్తున్నాడు. ఇంతలో వేద మేడ మీదకి వెళ్ళడాన్ని చూసాడు. అనుకోకుండా తన అడుగులు కూడా మేడ మెట్ల మీదకి నడిచాయి.

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *